కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం నెలకొంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే ఈసారి ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. 2017 నుంచి ఈ ఆనవాయితీ వస్తోంది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. అయితే ఈసారి ఆదివారం రావడంతో మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో.. సిల్వర్.. మళ్లీ విశ్వరూపమే.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం అవుతాయని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జనవరి 28 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని ప్రచారం జరుగుతోంది. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ప్రసంగించనున్నారు. దీంతో బడ్జెట్ తేదీ మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1 కాకుండా మరో తేదీలో బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. ఇక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు అనేక రాయితీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతలు కల్పించవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నిర్మలమ్మ బడ్జెట్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం విత్తన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు వన్ నేషన్-వన్ ఎలక్షన్, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లు ప్రవేశపెట్టే ఛాన్సుంది.