Supreme Court’s constitution bench verdict on demonetisation on January 2: ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది. శీతాకాలం సెలవుల తర్వాత జనవరి 2న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుంది.
నోట్ల రద్దు విషయంపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత డిసెంబర్ 7న తీర్పును రిజర్వ్ చేసింది. నోట్ల రద్దు ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నిర్దేశించిన అధికారాలు, విధానానికి విరుద్ధమని వాదనలు జరిగాయి. నోట్ల రద్దుపై ఏర్పడిన అత్యున్నత సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి. రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు.
Read Also: Train Derail: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ రైలు..
నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలకు, బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టాలని నవంబర్ 8, 2016లో బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చట్టం, 1934లోని సెక్షన్ 26 (2) ప్రకారం ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును చేపట్టింది. ఈ నిర్ణయం తరువాతి రోజు నుంచి రూ.500, రూ.1000 రద్దు చేయబడ్డాయి. ఈ నోట్లను డిసెంబర్ 30, 2016 వరకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం సమయంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న రూ. 17.97 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉంది. నోట్ల రద్దుతో రద్దు చేయబడిని కరెన్సీ విలువ రూ. 15.44 లక్షల కోట్లలో రూ. 15.31 లక్షల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పిటిషనర్ల తరుపున పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచే యోచన, టెర్రర్ ఫండింగ్, బ్లాక్ మనీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంది. గతంలో 1946, 1978లో ఇలాంటి నోట్ల రద్దు జరిగింది.