దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ పథకంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. అగ్నిపథ్ పథకాన్ని ఓ దశాదిశ లేని పథకంగా అభివర్ణించారు. ఈ వివాదాస్పద పథకాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తడి తీసుకువస్తామని.. కాంగ్రెస్ పార్టీ యవతకు సపోర్ట్ గా నిలబడుతుందని సోనియాగాంధీ వెల్లడించారు. సోనియా గాంధీ లేఖను మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రిక్రూట్మెెంట్ స్కీమ్ ఆర్మీ ఉద్యోగాలను ఆశించేవారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా ప్రకటించిన పథకంగా ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్మీ ఆశావహుల మాటలను విస్మరించి అగ్నిపథ్ స్కీమ్ ను తీసుకువచ్చినందుకు తాను నిరాశ చెందానని లేఖలో వెల్లడించారు. చాలా మంది మాజీ సైనిక ఉద్యోగులు ఈ పథకంపై సందేహాలు లేవనెత్తుతున్నారని.. ఈ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని అన్నారు. నిజమైన దేశభక్తులుగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా హింస లేకుండా ఓర్పు, శాంతితో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా నిలుస్తుందనన్నారు. మీరు కూడా శాంతి, అహింసాయుతంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు.
ఎనిమిది రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల్లో ఒకరు మరణించగా.. 600 మందికి పైగా అరెస్ట్ చేయబడ్డారు. బీహార్ లోని 12 జిల్లాలతో పాటు హర్యానాలో ఇంటర్నెట్ నిలిపివేశారు. చాలా చోట్ల రైల్వే స్టేషన్ల వద్ద బందోబస్తును పెంచారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా అగ్నిపథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే , అగ్నిపథ్ ను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.