Mary Millben: యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు రేపు జరగబోయే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అయోధ్యంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు, సాధువులు 7000 మంది వరకు హాజరవుతున్నారు. లక్షల్లో ప్రజలు ఈ వేడుకను చూసేందుకు అయోధ్య చేరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కోసం తాను భారతదేశంలో లేనందుకు బాధపడుతున్నానని ఆఫ్రికన్-అమెరికన్ నటి, గాయని మేరీ మిల్‌బెన్ అన్నారు. జనవరి 22న తాను దీపావళి జరుపుకుంటానని చెప్పారు. శ్రీరామ్ లల్లా ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది.
Read Also: Gidugu Rudra Raju: రాహుల్ గాంధీ వదిలిన బాణం షర్మిల..
అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక తనకు రెండో దీపావళిగా అనిపిస్తోందని, నేను ఆ రోజు దీపావళి జరుపుకుంటానని, ఈ వేడుకల కోసం నేను భౌతికంగా భారతదేశంలో లేనందుకు బాధగా ఉందని, ఈ వేడుకలో అత్యంత అందమైన విషయం ఏమిటంటే.. ఇది ప్రజలంతా కలిసి జరుపుకునే క్షణమని, ఇది విశ్వాసానికి సంబంధించిన అంశమని ఆమె అన్నారు.
ఇప్పటికే రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. రేపు మధ్యాహ్నం సమయంలో కేవలం గర్భగుడిలో ప్రధానితో సహా ఐదుగురు మాత్రమే ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. అయోధ్య జనసందోహంగా మారడంతో ఇప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు ఉగ్ర సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర భద్రతా ఎజెన్సీలతో పాటు రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.