దేశ సరిహద్దుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అన్నారు. ఎన్డీటీవీ తొలి డిఫెన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేము అన్ని సమయాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శాంతి సమయంలో కూడా మేము సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ‘‘భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మా బలగాలు ధీటుగా సమాధానమిస్తాయి. మేం ఏ దేశంపైనా దాడి చేయలేదు, ఎవరి భూమిలోనూ ఒక్క అంగుళం ఆక్రమించలేదు. కానీ, ఎవరైనా తమపై దాడికి పాల్పడితగే మాత్రం ధీటుగా బదులిస్తాం’’ అని చెప్పారు.
Read Also: Elevated Corridor: రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
కాశ్మీర్, లడఖ్‌తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తత, తూర్పు లడఖ్ లోని పలు ప్రాంతాల్లో భారత్, చైనా దళాలకు మధ్య ఉద్రిక్తత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన తొలగేందుకు అక్టోబర్ నెలలో ఇరు దేశాల మధ్య 20వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు చుషుల్‌లో జరిగాయి. అయినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. దేశాల మధ్య శాంతిని నిర్ధారించడానికి సరిహద్దు నిర్వహణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించారు.
భారత్ ‘ఆత్మ నిర్భర భారత్’పై దృష్టి సారించిందని రాజ్ నాథ్ అన్నారు. 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగాన్ని తమ ప్రధాన ప్రాధాన్యతగా తీసుకున్నామని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టమానరి సైనిక ఆధునీకరణపై దృష్టి సారించామని అన్నారు. గత ప్రభుత్వాలు రక్షణ రంగానికి పెద్దపీట వేయలేదని తాను చెప్పడం లేదని, అయితే రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ తీసుకువచ్చామని చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ గతంలో కూడా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనవరి నెలలో మాట్లాడుతూ.. భారత్ ప్రస్తుతం ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మ శక్గిగా ఎదగడాన్ని ప్రపంచం చూస్తోందని, భారత్-చైనా సంబంధాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ అందరితో మంచి సంబంధాలను కోరుకుంటుందని నొక్కి చెప్పారు.