మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా పుణేలో మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు రాజ్ ఠాక్రే. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు.
తాజాగా ఆదివారం పూణేలోని గణేష్ కళా క్రీడా మంచ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు రాజ్ ఠాక్రే. ఈ ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చాలని ప్రధానిని కోరారు. జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు రాజ్ ఠాక్రే. రెండు రోజుల క్రితం నా అయోధ్య పర్యటనను వాయిదా వేస్తూ ట్వీట్ చేశానని… ప్రతీ ఒక్కరూ తమ స్పందనను తెలియజేయడానికే ఉద్దేశపూర్వకంగా ప్రకటన ఇచ్చానని.. నా అయోధ్య టూర్ ను వ్యతిరేఖిస్తున్న వారు నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. నేను ఆ ట్రాప్ లో పడనని రాజ్ ఠాక్రే అన్నారు.
మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని.. లేకపోతే హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని నేను చెప్పిన తర్వాత నవీనీత్ రాణా దంపతులు హనుమాన్ చాలీసా పఠిస్తామని అన్నారని… సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ఏమైనా మసీదా..? అంటూ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. శివసైనికులు, రాణా దంపతులకు మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసని రాజ్ ఠాక్రే అన్నారు. శివసేన ప్రభుత్వంపై రాజ్ ఠాక్రే కీలక విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీని పెద్ద పార్టీగా చేశారని మండిపడ్డారు.
కాగా… రాజ్ ఠాక్రే ర్యాలీకి అనుమతి కోసం పుణే పోలీసులు 13 ఆంక్షలు విధించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు ఎటువంటి మారణాయుధాలు తీసుకురావద్దని, లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రత సుప్రీం కోర్ట్ ఆర్డర్ కు లోబడి ఉండాలని నిబంధనలు విధించింది.