రాహుల్ గాంధీ.. త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్యతలను ప్రస్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.. ఇక, ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయినట్టు తెలుస్తోంది.. లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధీర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రచారం సాగుతోంది.. దీనికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. అధీర్ రంజన్ చౌదరి స్థానంలో మనీశ్ తివారీ, లుధియానా, శశిథరూర్, గౌరవ్ గొగోయ్ లో ఎవరికో ఒకరికి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం ఓవైపు సాగినా.. అనూహ్యంగా రాహుల్ పేరు తెరపైకి వచ్చిందంటున్నారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు రాహుల్.. ఇప్పుడు.. ఆయనకు మరింత వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా కీలక బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ సిద్ధం కావడంతో.. అందరి కళ్లు ఆయనపైనే ఉన్నాయంటున్నారు.