కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఇవాళ ఈడీ ముందుకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఇదే సమయంలో సత్యమేవ జయతే అంటూ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చారు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు ఎక్కడిక్కడ వారిని అడ్డుకుంటున్నారు.. అరెస్ట్ చేస్తున్నారు..
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. మూడు అంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.. జల ఫిరంగుల వాహనాలను కూడా మోహరించారు.. ఏఐసీసీ కార్యాలయానికి బృందాలుగా వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.. ఇక, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి అక్బర్ రోడ్డు నుండి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) కార్యాలయం వరకు జరగాల్సిన కాంగ్రెస్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈరోజు రాజకీయంగా బల నిరూపణకు పార్టీ ప్లాన్ చేసినా.. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్టు పోలీసులు చెబుతున్నారు..
కొంతమంది నేతలనే ఏఐసీసీ కార్యాలయానికి అనుమతిస్తున్నారు పోలీసులు.. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుండగా… ఇంటి నుంచి నేరుగా ఈడీ ఆఫీసుకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.. అయినా.. ఆయన లెక్కచేయకుండా ఏఐసీసీ కార్యాలయానికి బయల్దేరాడు.. దీంతో.. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అక్బర్ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టూ సెక్షన్ 144 CrPC విధించారు పోలీసులు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకావాల్సిన తమ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలంతా మార్చ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ఢిల్లీ పోలీసులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి అన్ని ఎంట్రీ పాయింట్లను అడ్డం పెట్టారని, ప్రజలు ప్రవేశించకుండా, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ పార్టీ కార్యాలయంలో సమావేశమై రాహుల్ గాంధీతో పాటు ఊరేగింపుగా ఈడీ వద్దకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీతో కలిసి కవాతు చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. మీరు ఢిల్లీలో ఉంటే రండి, మా పార్టీ కార్యాలయం 24, అక్బర్ రోడ్ నుండి ఈడీ కార్యాలయానికి మార్చ్ చేద్దాం అంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ ఠాగూర్. ఇక, సత్యమేవ జయతే అంటూ రాహుల్ గాంధీ ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి.. బెలూన్లను కూడా ఎగరవేశాయి కాంగ్రెస్ శ్రేణులు.