PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. శ్రీలంక-భారత్ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోడీ అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శనివారం ద్వీప దేశం ఈ అవార్డును అందించింది. ‘‘మిత్ర విభూషణ’’ పతకం ద్వారా శ్రీలంక మోడీని గౌరవించింది. ఇది స్నేహం, వారసత్వాన్ని సూచిస్తుంది. ప్రధాని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
Read Also: CBI Raids: చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా 18 చోట్ల దాడులు
‘‘ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఇది నాకు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు గౌరవం. ఇది శ్రీలంక, భారతదేశ ప్రజల మధ్య చారిత్రక సంబంధాన్ని, లోతైన స్నేహాన్ని చూపిస్తుంది. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు అధ్యక్షుడు, శ్రీలంక ప్రభుత్వం, ఇక్కడి ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఆయన అన్నారు.
అనుర కుమార దిస్సానాయకే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటిసారిగా ఆయన భారతదేశానికి వచ్చారని, ఆయన ఎన్నికైన తర్వాత మొదటి అంతర్జాతీయ నాయకుడిగా తాను శ్రీలంకకు వచ్చానని, ఇది మా సంబంధాల లోతును తెలియజేస్తుందని ఆయన అన్నారు. 2019 బాంబు దాడులు, కోవిడ్-19 సమయంలో భారత్ శ్రీలంక కష్టకాలంలో అండగా నిలబడిందని మోడీ అన్నారు. ‘‘మిత్ర విభూషణ’’ పతకం రెండు దేశాల మధ్య సంబంధాల పటిష్టతను తెలియజేస్తుందని చెప్పారు. శ్రీలంక అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీకి ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.