Tamil Nadu: తమిళనాడులో గత కొంత కాలంగా గవర్నర్ వర్సెస్ డీఎంకేగా వ్యవహారం కొనసాగుతోంది. గవర్నర్ ఆర్ఎన్ రవి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అధికార డీఎంకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్ కూడా నేరుగా గవర్నర్‌పై తన అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక నివాసంపై పెట్రోల్ బాంబు విసిరిన వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కారుక వినోద్ అనే వ్యక్తి రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబులు విసిరిన కేసులో కూడా వినోద్ అరెస్టయ్యాడు. ఈకేసులో మూడు రోజుల క్రితమే విడుదయ్యాడు.
Read Also: Congress: బీజేపీ-బీఆర్‌ఎస్‌ల లగ్గం పిలుపు.. పెండ్లి కార్డు విడుదల చేసిన కాంగ్రెస్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపేట కోర్టు ఆవరణలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ చోరీ చేసి, రాజ్ భవన్ వైపు వెళ్లి రెండు బాటిళ్లలోని పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. మరో రెండు పెట్రోల్ బాంబులు విసరడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
ఈ ఘటనపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. రాజ్ భవన్ పై పెట్రో బాంబులు విసరడం రాష్ట్రంలో నిజమైన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. డీఎంకే మాత్రం చిన్న విషయాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు నిమగ్నమై ఉండగా నేరాగాళ్లు వీధుల్లోకి వస్తున్నారు అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన ఈ వ్యక్తే రాజ్ భవన్ పై దాడి చేశాడు. ఈ దాడులకు డీఎంకేనే స్పాన్సర్ చేస్తుందని ఎవరైనా అనుకోవచ్చని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు సిద్ధమవుతాడంటూ విమర్శించారు.