Shivraj Singh Chouhan: రాహుల్ గాంధీ యూకే కేంబ్రిడ్జ్ వేదికగా భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా తనతో పాటు పలువురు రాజకీయ నేతలపై నిఘా పెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై బీజేపీ విరుచుకుపడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. పెగాసస్ ఫోన్ లో లేదని, అది రాహుల్ గాంధీ నీ మైండ్ లో ఉందని విమర్శించారు. పెగాసస్ కాంగ్రెస్ డీఎన్ఏలో ప్రవేశించిందని అన్నారు. రాహుల్ తెలివితేటలకు నేను జాలిపడుతున్నా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Also: Opposition letter to Modi: ప్రధాని మోదీకి 9 మంది ప్రతిపక్ష నేతల లేఖ.. కారణం ఇదే..
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు, విదేశాల్లో భారత్ పరువు తీయడం కాంగ్రెస్ కొత్త ఎజెండాగా మారిందని చౌహాన్ విమర్శించారు. భారతదేశ ప్రజలు రాహుల్ గాంధీని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రశ్నించేవారిపై దాడులు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే బీబీసీపై దాడులు చేశారని ఆయన అన్నారు. దేశంలో మైనారిటీలు, ఆదివాసీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయని మాట్లాడారు. ఈ విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. విదేశాల్లో, భారతదేశ పరువు తీస్తున్నారంటూ ఆరోపిస్తోంది.