Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్ కేంద్రంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లబోతున్నారు.
Read Also: Periodic Labor Force Survey: భారత్‌లో ఏ మతానికి చెందిన మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు?
ఈ ఉద్రిక్తతల నడుమ పాక్ పంజాబ్ ప్రభుత్వం రావల్పిండితో అక్టోబర్ 17 వరకు 144 సెక్షన్ విధించింది. 144 సెక్షన్ వివిధ రకాల రాజకీయ సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల్ని నిషేధించడానికి ప్రభుత్వానికి అనుమతి ఇస్తుంది. రావల్పిండిలో, ఆ ఆదేశాలు అక్టోబర్ 10 నుండి 17 వరకు ఒక వారం పాటు అమలులో ఉంటాయి.
ఎస్‌సీఓలో ఇండియా, చైనా, బెలారస్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, పాకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. పాకిస్తాన్‌లో చాలా రోజుల తర్వాత జరుగుతున్న గ్లోబల్ ఈవెంట్ ఇది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఎలాంటి నిరసన, హింసాత్మక చర్యలకు దిగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు ఇస్లామాబాద్ వ్యాప్తంగా పాక్ ఆర్మీ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇస్లామాబాద్-రావల్పింది జంట నగరాల్లో ఐదురోజుల పాటు మ్యారేజ్ హాల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లను మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు.