Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో 2022లో సుప్రీకోర్టు ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులకు ఇచ్చిన ఉత్తర్వుల పరిధిని అన్ని రాష్ట్రాలు, యూటీలకు విస్తరించింది. ద్వేషపూరిత ప్రసంగాలు దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగలవని సుప్రీం పేర్కొంది. ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన నేరాలను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఇలాంటి కేసులో చర్యలు తీసుకోవడంతో విఫలం అయిన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కోరింది.
Read Also: Shweta Death Case: శ్వేత మృతికి కారణం అదే..! షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీపీ
ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ ఈ రోజు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతీ రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని పిటిషనర్లు కోరగా.. ప్రతీ జిల్లాకు ఒకరిని నియమించాలని ధర్మాసనం సూచించింది. సోషల్ మీడియాలో ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించడానికి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతరు విద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదును కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ కు అనుమతి అవసరమని మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారని, హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, న్యాయమూర్తులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదని కేవలం వారి మనసులో భారత రాజ్యాంగం మాత్రమే ఉంటుందని బెంజ్ పేర్కొంది. ప్రజాప్రయోజనం, చట్టం యొక్క పాలన స్థాపనను నిర్థారించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. దీనిపై మే 12న తదుపరి విచారణ చేపట్టనుంది.