Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ఎన్డీయేకు లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీల బలం ఉండటంతో బిల్లు సులభంగానే పాస్ అవుతుంది. అయితే, బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కేరళలోని ప్రముఖ కాథలిక్ చర్చి నడిపే దినపత్రిక వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఆర్టికల్ ప్రచురించింది. ఈ బిల్లుని ‘‘లౌకికవాదానికి కీలకమైన పరీక్ష’’గా అభివర్ణించింది. దీనిని వ్యతిరేకిస్తే మతపరమైన మౌలిక వాదాన్ని ఆమోదించినట్లు అవుతుందని ఆ రాష్ట్ర ఎంపీలను హెచ్చరించింది.
Read Also: Physical Harassment: జర్మన్ యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్
మంగళవారం ప్రచురించిన ఎడిటోరియల్‌లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపింది. మలయాళ వార్తా పత్రిక దీపికలో సంపాదకీయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ సవరణలకు మద్దతు ఇవ్వాలని కోరింది. రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టే ఈ బిల్లు వక్ఫ్ చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నించడం లేదని, కానీ భూమిని ఆక్రమణలను అనుమతించే, రాజ్యాంగ పరిష్కారాలను తిరస్కరించే నిబంధనలను సవరించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. ‘‘ఇది ముస్లిం సమాజంలోని ఏ సభ్యుడికి అన్యాయం చేయదు’’ అని చెప్పింది. వక్ఫ్ చట్టం ద్వారా ప్రభావితమైన వేలాది మంది హిందూ, క్రైస్తవ, ముస్లిం పౌరులకు ఇది సహాయపడుతుందని పేర్కొంది.
కాంగ్రెస్, సీపీఎంలు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమైతే, చెప్పడానికి ఏమీ లేదని సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (KCBC) ఇటీవల చేసిన విజ్ఞప్తిని కూడా సంపాదకీయం గుర్తుచేసింది. దాని అధ్యక్షుడు కార్డినల్ మార్ బసేలియోస్ క్లీమిస్ కాథలికోస్ వక్ఫ్ చట్టానికి కేరళ ఎంపీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయన కేరళలో వక్ఫ్ చట్టం వల్ల ప్రభావితమై నిరాశ్రయులు అయిన మునంబం కేసును ఉదహరించారు.