Ponguleti Srinivas Reddy : గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు 400 ఎకరాల భూమి విషయాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ ఇప్పుడు అప్రసక్తమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. అంతేకాదు, ఈ భూములను తమ అనుబంధ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసిన చీకటి ఒప్పందాల వెనుక ఆ పార్టీనే ఉందని ఆరోపించారు. గచ్చిబౌలి భూముల వివాదం పెరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 1న మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి ఇందులో లేదని స్పష్టత ఇచ్చారు. గతంలోనే ప్రభుత్వం, విశ్వవిద్యాలయం భూ మార్పిడి ఒప్పందాన్ని పూర్తి చేసిందని వెల్లడించారు. అంతేకాదు, 400 ఎకరాల ల్యాండ్ కేసులో ప్రభుత్వం కోర్టులో విజయం సాధించిందని, దాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూముల చదును పనులు జరగుతున్న నేపథ్యంలో, మూగ జీవాలు చనిపోయాయని, పర్యావరణానికి హానికరమని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు సృష్టించిన కుట్రలో భాగంగానే పాత ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ముసుగులో ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఒక్క జంతువు అయినా చనిపోయినట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అనవసరమైనవని ఖండించిన మంత్రి పొంగులేటి, ఇప్పటి వరకు హెచ్‌సీయూ భూములకు ల్యాండ్ టైటిల్ లేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం విశ్వవిద్యాలయం భూములకు టైటిల్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం మరోసారి రుజువైందని మంత్రి ధ్వజమెత్తారు. అభివృద్ధికి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా, ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Bhatti Vikramarka : తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు