Zomato: రెండేళ్ల క్రితం మొదలైన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ టెక్ కంపెనీల దగ్గర నుంచి దేశీయ కంపెనీల వరకు ఉద్యోగుల్ని ఎలా వదిలించుకోవాలా..? అని చూస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది. గత రెండేళ్లుగా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి.
ఇదిలా ఉంటే, తాజాగా, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ఏకంగా 600 మందిని ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో వృద్ధి మందగించడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి, ఆటోమేషన్‌పై ఎక్కువగా ఆధారపడేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటోతో పాటు దాని అనుబంధ వాణిజ్య విభాగం బ్లింకిట్ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది.
జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (ZAAP) కింద కంపెనీ దాదాపు 1,500 మంది కస్టమర్ సపోర్ట్ సిబ్బందిని నియమించుకుంది. వీరిని నియమించుకున్న ఏడాది లోపు తొలగించింది. అమ్మకాలు, కార్యకలాపాలు, సఫ్లై చైన్, ఇతర డిపార్ట్మెంట్‌లలోకి వీరిని ప్రమోట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ సిబ్బందిలో చాలా మంది ఒప్పందాలు పునరుద్ధరించలేదు. ఈ తొలగింపుల్లో ప్రభావితమైన సిబ్బందికి ఒక నెల జీతం అందిస్తున్నారు. వారికి ముందస్తు నోటీసు లేకుండా తొలగించారు. కారణాలు చెప్పకుండా తొలగించినట్లు ఉద్యో్గులు వాపోతున్నారు.
అయితే, జొమాటో తన కస్టమర్ సపోర్ట్ సిస్టమ్‌ని ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించడం వల్ల వీరి ఉద్యోగాలు పోయినట్లు అనుకుంటున్నారు. జోమాటో ఇటీవలే Nugget అనే AI-ఆధారిత కస్టమర్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం జొమాటో, బ్లింకిట్, హైపర్‌ప్యూర్ కోసం ప్రతీ నెల మిలియన్ల కొద్దీ సపోర్ట్ ఇంటరాక్షన్‌లను నిర్వహిస్తోంది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆటోమేషన్‌ని స్వీకరిస్తుండగా, దాని ఫుడ్ వ్యాపారంలో వృద్ధి మందగించడం కూడా ఉద్యోగుల తొలగింపుకు కారణంగా తెలుస్తోంది.