Rs.2000 Note Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. ప్రజలు నోట్లను మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో రూ.2000 నోటు చలామణి దాదాపుగా తగ్గిపోయింది. కేవలం 10 శాతం నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నట్లు వెల్లడించింది.
Read Also: Asifabad: గేదెను కరిచిన కుక్క.. ఆసుపత్రి పాలైన 302 మంది
ఇదిలా ఉంటే స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్‌లు, ID ప్రూఫ్ అవసరం లేదని తెలిపింది. కస్టమర్లు ఎలాంటి రిక్విజిషన్ స్లిప్ పొందకుండానే తమ రూ.2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లను మార్చుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఒకే సారి రూ. 20,000 వరకు రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సాఫీ పద్ధతిలో మార్పిడి ప్రక్రియను నిర్వహించడానికి అన్ని సదుపాయాలను కల్పించాలని ఎస్బీఐ అన్ని బ్రాంచులకు సూచించింది.
ఆర్బీఐ రూ.2000 నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు డిపాజిట్ లేదా మార్పిడి సౌకర్యాలు కల్పించాలని అన్ని బ్యాంకులను కోరింది. తక్షణమే రూ.2000 నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంకులను కోరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2,000 కరెన్సీ నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి ఆర్‌బిఐ పరిమితిని విధించలేదు. అయితే గరిష్టంగా రూ. 20,000 (రూ. 2,000 యొక్క 10 నోట్లు) కరెన్సీ నోట్లను ఒకేసారి మార్చుకోవడానికి అనుమతించబడుతుంది.