Ukraine War: ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఉక్రెయిన్ నగరం బఖ్‌ముత్ ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ బలగాలకు, ప్రైవేట్ కిరాయి సైన్యం వాగ్నర్ ను అభినందించారు. యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది. 70,000 మంది జనాభా ఉన్న ఈ బఖ్‌ముత్ పై పట్టుకోసం రష్యా గతేడాది నుంచి ప్రయత్నిస్తోంది. ఈ నగరం రష్యా వశం కాకుండా ఉక్రెయిన్ కూడా భారీ స్థాయిలో ప్రతిఘటిస్తోంది.
Read Also: Centre vs AAP: ఆప్‌కు మద్దతుగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో సీఎం నితీష్ కుమార్..
బఖ్‌ముత్ పట్టణంపై పట్టు కోసం ఇరు దేశాల సైనికులు భారీ స్థాయిలో ప్రాణాలను కోల్పోయారు. వెస్ట్రన్ దేశాలు ఇస్తున్న ఆర్థిక, సైనిక సాయంతో ఉక్రెయిన్ ఇన్నాళ్లుగా రష్యాను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల నుంచి రష్యన్ సైనికులు వెనక్కి తగ్గేలా చేసింది. అయితే తాజాగా బఖ్‌ముత్ పట్టణం రష్యా వశం కావడం యుద్ధానికి టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నారు. ఈ నగరం రష్యా చేతికి చిక్కితే డాన్ బాస్ లోని మరిన్ని ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరించారు.
బఖ్‌ముత్ పట్టణం రష్యా వశం కావడంతో ఇది ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి వెళ్లేందుకు ఓ రహదారిగా మారతుందని ఉక్రెయిన్ కలవరపడుతోంది. ఇదే జరిగితే క్రమంగా రాజధాని కీవ్, ఇతర ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. జీ-7 దేశాల సదస్సు జపాన్ లో జరుగుతోంది. ఈ సమావేశాలకు జెలెన్స్కీ కూడా వచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో ఆదివారం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు రష్యా, బఖ్‌ముత్ సొంతమైనట్లుగా ప్రకటించింది.