MK Stalin’s Son, Udhayanidhi, Joins His Cabinet As Sports Minister: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్ – తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఉదయనిధిని డీఎంకే పార్టీ భావిస్తోంది. ఉదయనిధి స్టాలన్ ఎప్పటి నుంచో మంత్రివర్గంలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ.. తాజాగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటికే డీఎంకే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 46 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్ డీఎంకే యూత్ వింగ్ కార్యదర్శిగా 2019లో నియమితులయ్యారు. అంతకుముందు సీఎం ఎంకే స్టాలిన్ దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ ఈ బాధ్యతలు తీసుకున్నారు.
Read Also: Raghuram Rajan: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర
బుధవారం ఉదయం గవర్నర్ ఆర్ఎన్ రవి, ఉదయనిధితో ప్రమాణస్వీకారం చేయించారు. 2018లో తండ్రి కరుణానిధి మరణం తరువాత డీఎంకే పార్టీ పగ్గాలను చేపట్టారు ఎంకే స్టాలిన్. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాడులో తనదైన పాలనతో ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్ పలు కోలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇదిలా ఉంటే ఉదయనిధి స్టాలిన్ పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రమైన విమర్శలు చేశారు. ఉదయనిధిని ‘ప్లేబాయ్’గా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు. యువరాజు మంత్రివర్గంలో చేరుతారంటూ విమర్శలు గుప్పించారు.