Eknath Shinde: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోవడానికి ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వస్తుందని ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు కొనసాగాయి.. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. మహాయుతి మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉంది.. మేమంతా సానుకూలంగానే ముందుకు వెళ్తున్నాం.. ప్రజలు మాకు ఇచ్చిన స్పష్టమైన తీర్పుపై మాకు గౌరవం ఉందన్నారు. త్వరలోనే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. మేం నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అందరికి తెలుస్తుంది అని ఏక్ నాథ్ షిండే పేర్కొన్నారు.
Read Also: Air Pollution Crisis: వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ముంబై.. ఢిల్లీలో నానా అవస్థలు
అయితే, మహాయుతి భారీ మెజార్టీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మాత్రం గత మూడు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈక్రమంలో షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ అమిత్ షాతో చర్చించారు. మరోవైపు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బీజేపీ అధిష్ఠానం బేరీజు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నప్పటికి మరో ఆలోచన పైనా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.