Mobile phone explode: మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం కానీ, దానిని వాడటం కానీ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా మనం ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూనే ఉంటాం. ఫలితంగా మొబైల్ ఫోన్లు పేలి ప్రమాదాలకు గురవుతున్నాం. తాజాగా మధ్యప్రదేశ్‌లో 9 ఏళ్ల చిన్నారి చేతిలో మొబైల్ ఫఓన్ పేలింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలోని చౌరాయ్ ప్రాంతంలోని కల్కోటి దేవరీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో తాను, తన భార్య పొలంలో పనిచేస్తున్నామని బాలుడి తండ్రి హర్దయాల్ సింగ్ తెలిపారు. బాలుడు తన స్నేహితులతో కలిసి మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తుండగా, ఛార్జింగ్ పెట్టడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
Read Also: 19 Trains Canceled: ఏపీలో వర్షాల ఎఫెక్ట్.. 19 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!
ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు తమకు సమాచారం అందించారని, అతని రెండు చేతులు, తొడలపై గాయాలయ్యాయని, చింద్వారాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని బాలుడి తండ్రి చెప్పారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అనంతరం సర్జికల్ వార్డుకు తరలించామని చింద్వారాలోని జిల్లా ఆస్పత్రికి చెందిన డాక్టర్ అనురాగ్ విష్కర్మ తెలిపారు. కాళ్లు, చేతులకు లోతైన గాయాలు ఉన్నాయని చెప్పారు. 2023లో కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. 8 ఏళ్ల బాలిక చేతిలో మొబైల్ పేలడంతో 8 ఏళ్ల బాలిక గాయపడి మరణించింది. ఫోన్ ఎక్కువ సేపు వాడటం వల్ల బ్యాటరీ వేడెక్కి పేలిపోయిందని పోలీసులు నిర్ధారించారు.