టెర్రర్ ఫండింగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు యాసిన్ మాలిక్ వివిధ దేశాలు, సంస్థల నుంచి నిధులు సేకరించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మే 19న ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్ట్ యాసిన్ మాలిక్ ని టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా తేల్చింది. దీంట్లో భాగంగా బుధవారం న్యాయస్థానం ముందు యాసిన్ మాలిక్ ను అధికారులు హాజరుపరిచారు.
అన్ లా ఫుల్ యాక్టవిటీస్ యాక్ట్ (ఉపా) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద యాసిన్ మాలిక్ పై కేసులు నమోదు అయ్యాయి. యూఏపీఏ లోని సెక్షన్‌లు 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్య కోసం నిధుల సేకరణ), 18 (ఉగ్రవాద చర్యకు కుట్ర) మరియు 20 (ఉగ్రవాద ముఠా లేదా సంస్థ సభ్యుడు) మరియు సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), ఐపీసీ-124 ఏ (విద్రోహం) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు కోర్టులో యాసిన్ మాలిక్ కు ఉరి శిక్ష విధించాలని ఎన్ఐఏ బలంగా వాదించింది. అయితే స్పెషల్ జడ్జ్ ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. అతడి చివర శ్వాస వరకు జైల్లోనే ఉంచాలని స్పష్టం చేశారు.
యాసిన్ మాలిక్ కేసులో తీర్పు సందర్భంగా కాశ్మీర్ లోయ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈ కేసులో కాశ్మీరీ వేర్పాటువాద నేతలైన ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండీ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీం ఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ షా వతాలి, షబీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్ మరియు నావల్ కిషోర్ కపూర్ పై కోర్ట్ అభియోగాలు మోపింది. ఈ కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయూద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ లపై కూడా చార్జీషీట్ దాఖలు చేశారు ఎన్ఐఏ అధికారులు.