మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులకు బడితపూజ జరిగింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడీషియల కస్టడీకి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పంపింది. నిందితులను కోర్టులో హాజరుపరిచి పోలీసులు బయటకు తీసుకొస్తుండగా.. ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న న్యాయవాదులు అమాంతంగా ఎటాక్ చేశారు. హతుడు సౌరభ్ భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్‌పై లాయర్లు మూకుమ్మడి దాడి చేశారు. నిందితులిద్దరినీ లాయర్లంతా కుమ్మేశారు. సాహిల్ దుస్తులను చించేశారు. దీంతో పోలీసులు జోక్యం పుచ్చుకుని అతి కష్టం మీద విడిపించుకుని వెళ్లిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భార్య ముస్కాన్, ప్రియుడి సాహిల్ చేతిలో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ అత్యంత ఘోరంగా హత్యకు గురయ్యారు. సౌరభ్ రాజ్‌పుత్(29) ముస్కాన్ (27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరబ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. ఇక 2019లో వీరికి ఒక పాప పుట్టింది. అయితే భార్య పోరు భరించలేక.. సౌరబ్ తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టాడు. ఇక సౌరభ్ కూడా ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లిపోయాడు. బేకరీలో పని చేస్తూ.. అప్పుడప్పుడు భారత్‌కు వస్తూ ఉండేవాడు. ఈ మధ్యలో సాహిల్(25) అనే యువకుడితో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఇద్దరూ కూడా డ్రగ్స్‌కు బానిసలైపోయారు. అయితే విషయం తెలిసి సౌరబ్ విడాకులు ఇచ్చేయాలని అనుకున్నాడు. కానీ కుమార్తె కోసం వెనక్కి తగ్గాడు. అయితే ముస్కాన్ మాత్రం.. తన భర్త సౌరబ్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం అదునుచూసింది. అయితే సౌరబ్.. తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చాడు. అప్పటి నుంచి భర్తను చంపేందుకు ముస్కాన్ శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్ కాలేదు. చివరికి మార్చి 4న ప్రియుడ్ని ఉసిగొల్పి హత్యకు ప్లాన్ చేసింది. అంతే భర్తకు మత్తు మందు ఇచ్చి మర్డర్ చేశారు. అనంతరం మృతదేహాన్ని 15 ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి సిమెంట్‌తో కప్పేశారు.
కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో.. సౌరబ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకోగా… బండారం బయటపడింది. తామే చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. మొత్తానికి 15 రోజుల తర్వాత హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా ముస్కాన్.. హోలీ రోజు హతుడి సోదరితో చేసిన వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని నిందితురాలు ముస్కాన్ తల్లిదండ్రులు కోరారు. తమ కుమార్తెనే సౌరబ్ కుటుంబాన్ని నాశనం చేసిందని.. బంగారం లాంటి కుటుంబాన్ని విడదీసిందని మండిపడ్డారు. డ్రగ్స్‌కు బానిసై ఇంతటి నీచానికి ఒడిగట్టిందని దుమ్మెత్తిపోశారు.