Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ టికెట్ల వివాదం రచ్చరచ్చ అవుతోంది. మంగళవారం రోజు 189 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే వీటిలో 52 మంది పాతవారిని కాదని కొత్త వారికి చోటు కల్పించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి టికెట్ నిరాకరించింది. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Fire Accident : హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు
ఇదిలా ఉంటే తాజాగా ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరును చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. ఉడిపిలోని తన నివాసంలో విలేకరులతో భట్ మాట్లాడుతూ..‘‘పార్టీ నిర్ణయంపై నేను బాధగా లేను, కానీ పార్టీ నాతో వ్యవహరించిన తీరు నన్ను బాధించింది’’ అని కంటతడి పెట్టారు. పార్టీ నిర్ణయాన్ని తెలియజేయడానికి పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా తనకు ఫోన్ చేయలేదని, టెలివిజన్ ఛానెళ్ల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని ఆయన అన్నారు.
అమిత్ షా జగదీష్ షెట్టర్ కి ఫోన్ చేసి మార్పుల గురించి తెలియజేశారని, అయితే షా నన్ను పిలుస్తారని నేను అనుకోను కానీ కనీసం జిల్లా అధ్యక్షుడైనా ఫోన్ చేసి ఉండాల్సింది అని అన్నారు. నా కులం కారణంగా నాకు టిక్కెట్ నిరాకరిస్తే దానికి నేను అంగీకరించని అన్నారు. పార్టీ ఎదుగుదలకు అవిశ్రాంతంగా పనిచేసిన తనలాంటి వ్యక్తులు బీజేపీకి అవసరం లేదని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, తనకు అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నిలబెట్టిన యశ్ పాల్ సువర్ణకు మద్దతిస్తానని అన్నారు. తదుపరి చర్యల కోసం తక్షణ నిర్ణయం ఇప్పుడేం చెప్పలేనని అన్నారు.