Fire Accident : హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని శాస్త్రీపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా మరోసారి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లాపూర్ పారిశ్రామికవాడలో జేపీ ఇండస్ట్రీస్ కంపెనీలో అగ్గిరాజుకుంది. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు . స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది.

దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారింది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరాదీస్తున్నారు. చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటున్నారు. పరిశ్రమలో కెమికల్ ఉండటంతో ఓ పక్క మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపు చేస్తున్నా మరో పక్క మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ పారిశ్రామిక వాడలో ఇంతకు ముందు కూడా అగ్ని ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.