Karnataka: కర్ణాటకలో మరోసారి ‘‘టిప్పు జయంతి’’ ఉత్సవాలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశపనవ్వర్ అసెంబ్లీలో పిలుపునిచ్చారు. కాశపనవ్వర్ టిప్పు జయంతిని నిలిపేయడాన్ని ప్రశ్నించారు. ఈ వేడుకల్ని ఎందుకు జరపకూడదని అడిగారు. 2013 నుంచి టిప్పు జయంతి ఉత్సవాలను ప్రారంభించామని, దీనిని తిరిగి ప్రారంభించాలని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జయంతిని జరుపుకోవడం తప్పా.? అని ప్రశ్నించారు. కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కూడా ఈ వేడుకల్ని పునరుద్ధరించాలని కోరారు. ఇది లౌకిక దేశమని, టిప్పు జయంతిని జరుపుకుంటే తప్పేంటని, హిందూ ముస్లింల సమస్యల్ని బీజేపీ సృష్టిస్తోందని అన్నారు.
Read Also: IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
అయితే, ఈ ప్రతిపాదనలపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ చర్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ నేత ఆర్ అశోక అన్నారు. కాంగ్రెస్ ముస్లింల పట్ల ప్రేమ, హిందువుల పట్ల ద్వేషంతో టిప్పు జయంతిని జరుపుకుంటుందని, చివరకు వారు ‘‘బిన్ లాడెన్ ’’ జయంతిని కూడా జరుపుకుంటారని ఎద్దేవా చేశారు. 2015లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతిని ప్రవేశపెట్టింది. అయితే, 2015, 2016లలో కొడగు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఘర్షణలు జరిగాయి. బీజేపీ టిప్పును హిందూ వ్యతిరేకిగా, మతపరమైన హింసకుడిగా ఆరోపిస్తోంది. 2019లో అప్పటి బీజేపీ ప్రభుత్వం అధికారికంగా టిప్పు జయంతిని నిలిపేసింది. శాంతిభద్రతల సమస్యగా పేర్కొంది.