Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్ర ఘటనకు పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్పడినట్లు తేలింది. పాకిస్తాన్ దేశంలో 80 శాతం మంది ప్రజలకు ఈ సింధు నది, దాని ఉపనదుల జలాలే జీవనాధారం. ప్రస్తుతం, ఈ ఒప్పందాన్ని నిలిపేయవద్దని పాకిస్తాన్ భారత్‌ని కోరుతోంది. ఇదిలా ఉంటే, భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిచే ఉంటుందని స్పష్టం చేసింది.
తాజాగా, సింధు నది జలాల విషయంలో భారత్ దాయాదికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, సింధు జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ పంటలకు నీటిని అందించే ప్రధాన నది నుంచి నీటిని మళ్లించే ప్రణాళికల్ని భారత్ పరిశీలిస్తోంది. భారత్ గుండా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు వెళ్లే చీనాబ్ పై ఉన్న రణబీర్ కాలువ పొడవును 120 కి.మీకి రెట్టింపు చేయాలని చూస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే అంటే, 1960కి ముందే ఈ కాలువ నిర్మించబడింది.
భారత్ చీనాబ్ నది నుంచి పరిమిత మొత్తంలో నీటిని తీసుకోవడానికి అనుమతి ఉంది. కాలువ విస్తరణకు సంవత్సరాలు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సెకన్‌కి 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఇది 40 క్యూబిక్ మీటర్లుగా ఉంది. రణబీర్ కాలువ విస్తరించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు ప్రస్తుతానికి నివేదించబడలేదు. కాలువను విస్తరించడంతో పాటు, ఆ దేశానికి కేటాయించిన సింధు, చీనాబ్, జీలం నుంచి నీటిని మెరుగ్గా వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నీటిని ఉతగ్తర భారత రాష్ట్రాలతకు తరలించే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది. కొత్తగా ఈ ఐదు రిజర్వాయర్ ప్రాజెక్టుల్ని భారత్ గుర్తించిందని, వాటిలో నాలుగు చీనాబ్, జీలం నదులపై ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ, ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’’ అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం ఒప్పందాన్ని భారత్ నిలిపి ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని నిలిపేయడం చట్టవిరుద్ధమని వాదిస్తూ, భారత్‌కి లేఖ రాశారు.
అయితే, ప్రస్తుతం సింధు నది వ్యవస్థ నుంచి భారత్ గణనీయమైన మొత్తంలో నీటిని నిలిపేయడం లేదా మళ్లించడం కోసం ఆనకట్టలు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి భారతదేశానికి సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పాకిస్తాన్‌కి వెళ్లే కొద్ది మొత్తాన్ని అడ్డుకున్నా కూడా ఆ దేశంలోని వ్యవసాయం అస్తవ్యస్తం అవుతుందని చెబుతున్నారు.