India’s first bullet train: భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ కారిడార్‌ని రూ. 1.08 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) ఈ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 270 కిలోమీటర్ల గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తైందని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. 270 కి.మీ పొడవునా వైర్ డక్ట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్ణీత కాలక్రమం ప్రకారం ప్రాజెక్ట్ కొనసాగుతోందని ఆయన హామీ ఇచ్చారు.
Read Also: Housing Crisis: భారత విద్యార్థులకు కెనడా షాక్..? హౌసింగ్ సంక్షోభం నేపథ్యంలో పరిమితి..
2026లో దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని.. సూరత్, బిలిమోరాల మద్య రైల్‌ని నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. వైర్ డక్ట్ పనులతో పాటు ముంబై-థానే అండర్ సీ టన్నెల్ పనులు కూడా ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ మార్గంలో ఉన్న 8 నదులపై వంతెనల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే రెండు వంతెనలు పూర్తయ్యాయని, సబర్మతిట టెర్మినట్ స్టేషన్ కూడా పూర్తైనంట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు జనవరి 8న ముంబై-అహ్మదాబాద్ రైల్ కారిడార్ కోసం 100 శాతం భూసేకరణ విజయవంతమైందని రైల్వే మంత్రి ప్రకటించారు. బుల్లెట్ రైలు కారిడార్‌కు రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆర్థిక నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లు, గుజరాత్ మరియు మహారాష్ట్రలు ఒక్కొక్కటి రూ. 5,000 కోట్లు అందించాయి, మిగిలిన నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి 0.1 శాతం వడ్డీ రుణం పొందుతున్నారు. సెప్టెంబర్ 2017లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జపాన్ షెంకన్‌సెన్ రైల్ సాంకేతికత ఆధారంగా ఈ భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రూపొందుతోంది.