కొన్ని సంవత్సరాల నుంచి భారత్ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నాటికి చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస సోమవారం 2022 ప్రపంచ జనాభా అంచనాల నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌కల్లా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని, ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న భారత్ 2023 నాటికి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుందని ఆ నివేదిక వెల్లడించింది.
ఐరాస గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా, భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. వచ్చే ఏడాది నాటికి చైనా ఫిగర్‌ను దాటనుందని పేర్కొంటున్న ఐరాస.. 2050 నాటికి భారతదేశ జనాభా సంఖ్య 166.8 కోట్లకు చేరనుందని అంచనా వేసింది. చైనా జనాభా మాత్రం 131.7 కోట్లకు తగ్గొచ్చని తెలిపింది. నిజానికి.. 2021లో ముగ్గురు బిడ్డల విధానాన్ని చైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినా, అక్కడ జననాల రేటు పడిపోతూ వస్తోంది. బహుశా 2016 వరకు ఉన్న ఒకే బిడ్డ విధానానికి అక్కడి జనాలు ఇంకా కట్టుబడి ఉన్నట్టున్నారు. కానీ, భారత్‌లో జననాల రేటు మాత్రం గణనీయంగా పెరుగుతూనే ఉంది. అందుకే, జనాభా అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతోందని గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇక ప్రపంచ జనాభా విషయానికొస్తే.. 2030 నాటికి 850 కోట్లు కాగా, 2050కి 970 కోట్లకు చేరే అవకాశముందని ఐరాస తెలిపింది. ‘‘ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని మనం చేరుకోనున్నాం. 800 కోట్ల మార్క్‌ని చేరుకోనున్నాం. ఆరోగ్య ప్రమాణాల్లో మరింత పురోగతి సాధిస్తున్న తరుణంలో.. ఆయుర్దాయం పెరుగుతోంది. మాతా, శివ మరణాల రేట్లు తగ్గుతున్నాయి’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెసర్ అన్నారు. ఇదే సమయంలో ఈ భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని సూచించారు.