Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిన్(ఎస్‌జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారతదేశాన్ని, ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదుల దాడిని పోలుస్తూ, ప్రధాని మోడీ ఈ దాడి నుంచి నేర్చుకోవాలని బెదిరించాడు. ఇలాంటి దాడి రాకుండా చూసుకోవాలంటూ బీరాలు పలికాడు.
పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు చట్టవిరుద్దమైన ఆక్రమణలో ఉన్న వ్యక్తులు ఇలాగే స్పందిస్తారని, హింస హింసను ప్రేరేపిస్తుందని ఓ వీడియోలో చెబుతూ కనిపించాడు.భారత్ పంజాబ్ ను ఆక్రమించడం కొనసాగిస్తే ప్రతిస్పందన ఉంటుందని భారత్, ప్రధాని మోడీనే దీనికి బాధ్యత వహించాలని పన్నూన్ హెచ్చరించాడు. సిక్ ఫర్ జస్టిస్ ఓటు-బ్యాలెట్ ను విశ్వసిస్తుందని, పంజాబ్ విముక్తికి సిద్ధంగా ఉందని పిచ్చి వాగుడు వాగాడు. బ్యాలెట్ కావాలో బుల్లెట్ కావాలో భారత్ మీరే తేల్చుకోండంటూ సవాల్ విసిరాడు.
కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పన్నూ భారత్ పై పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్‌లను బెదిరిస్తూ గతంలో వీడియోలు చేశారు. ఇటీవల ఇండియా నిర్వహిస్తున్న వరల్డ్ కప్ 2023 మ్యాచుల ముందు కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై అహ్మదాబాద్ లో కేసు నమోదైంది.
అమృత్‌సర్ లో జన్మించిన పన్నూ ప్రస్తుతం యూఎస్ లో ఆశ్రయం పొందుతున్నాడు. పంజాబ్ లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనలకు ఇతనితో సంబంధం ఉంది. పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇతనిపై ఎన్ఐఏ పలు కేసుల్ని పెట్టింది. ఇటీవల ఇతనికి, ఇతని కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. 2021లో ఎన్ఐఏ ఇతనిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.