Judicial Commission To Probe Atiq Ahmed Killing: దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య. శనివారం రాత్రి పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలకు వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపంలో నుంచి అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
Read Also: Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..
ఇదిలా ఉంటే ఈ హత్యలపై యూపీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పోలీసులు రక్షణగా ఉన్న ప్రాణాలకు భద్రత లేని రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ మారిందంటూ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హత్యలపై దర్యాప్తు చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వం వహిస్తారని, రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ సోనీ, మాజీ డిజిపి సుబేష్ కుమార్ సింగ్ సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
కమిషన్ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, రాష్ట్ర హోం శాఖ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. 2005 రాజుపాల్ హత్య, 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన విచారణను అతీక్ అహ్మద్ ఎదుర్కొంటున్నాడు. రెండు రోజుల క్రితం ఉమేష్ పాల్ హత్యలో కీలక నిందితుడు అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అతీక్ అహ్మద్ ను కూడా హత్య చేయబడ్డాడు.