Atiq Ahmed: అతిక్ అహ్మద్ ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో తిరుగులేని డాన్ గా ఎదిగాడు. చివరి రోజులను మాత్రం సీఎం యోగి ఆదిత్య నాథ్ దెబ్బకు బయపడుతూ బతికాడు. ఉత్తర్ ప్రదేశ్ వస్తే ఎప్పుడు ఎన్ కౌంటర్ అవుతానో అని తీవ్రంగా భయపడేవాడు. శనివారం రాత్రి ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్ తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు.
17 ఏళ్లకే మర్డర్ కేసు..
17 ఏళ్లకే తొలి మర్డర్ చేసిన అతిక్ అహ్మద్, 1962లో అలహాబాద్‌లో (ఇప్పుడు ప్రయాగ్‌రాజ్) జన్మించిన అతిక్ అహ్మద్ తన బాల్యాన్ని పేదరికంలో గడిపాడు. అతని తండ్రి బతుకుదెరువు కోసం పట్టణంలో గుర్రపు బండి నడిపేవాడు. చిన్న వయసులో చాలా పేదరికం అనుభవించడంతో డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడుతూ క్రిమినల్ గా మారాడు. ప్రయాగ్ రాజ్ తో భూకబ్జా సిండికేట్ కు డాన్ గా ఎదిగాడు. గ్యాంగ్ స్టర్ గా పొలిటీషియన్ గా మారాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆధారాలు లేకపోవడం, బాధితుతలు అతిక్ అహ్మద్ భయానికి ఫిర్యాదు చేయకపోవడంతో నేరాలు చేసుకుంటూ వెళ్లాడు.
హత్యలు, కిడ్నాప్ ఇలా పలు కేసులు అతడిపై ఉన్నాయి. 27 ఏళ్ల వయసులో తొలిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆ తరువాత ఇదే స్థానం నుంచి వరసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ తరుపు పోటీ చేస్తూ గెలిచాడు. ఎస్పీ కాదనడంతో అప్నాదళ్ లో చేరాడు. మళ్లీ 2004లో ఎస్పీలో చేరి పూల్పూర్ ఎంపీగా గెలిచాడు. 2009 నుంచి ఎక్కడా గెలవలేకపోయాడు. చివరిసారిగా 2019లో ప్రధాని మోదీపై పోటీగా వారణాసి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
రాజుపాల్ హత్యతో బిగిసిన ఉచ్చు..
44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ కలిగి ఉన్న అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు కూడా నేరాల్లో పాలుపంచుకున్నారు. తమ్ముడు అష్రాఫ్, భార్య షాహిస్తా పర్వీన్, ముగ్గురు కొడుకులు కూడా క్రిమినల్ నేరాల్లో నిందితులే. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ ను హత్య చేసిన కేసులో బలమైన సాక్షాలు దొరకడంతో అప్పటి నుంచి ఈ గ్యాంగ్ స్టర్ డౌన్ ఫాల్ ప్రారంభం అయింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ ఉన్నాడు. ఇతడిని ఈ ఏడాాది ఫిబ్రవరిలో అయన కొడుకులు అనుచరులు కలిసి హత్య చేశారు. 2006లో సాక్షి అయిన ఉమేష్ పాల్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో ఇటీవల ఇతడికి జీవితఖైదు పడింది. ప్రస్తుతం ఉమేష్ పాల్ హత్య విచారణ జరుగుతోంది.
ఎన్ కౌంటర్ భయం..
ఉమేష్ పాల్ హత్య అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ‘‘మాఫియాను మట్టిలో కలిపేస్తా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ హత్యలో పాల్గొన్న ఇద్దర్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న అతీక్ కొడుకు అసద్ ను ఝాన్సీలో పోలీసులు ఎన్ కౌంటర్ లో రెండు రోజుల క్రితం మరణించాడు. కొడుకు మరణంతో కోర్టులోనే అతీక్ అహ్మద్ ఏడ్చాడు. తన కొడుకు మరణానికి నేనే కారణం అని అన్నాడు. తన కుటుంబాన్ని వదిలిపెట్టాలని పోలీసులను కోరాడు. అయితే రెండు రోజుల్లోనే హత్యకు గురయ్యాడు. అతీక్ గ్యాంగ్ లో మొత్తం 144 మంది సభ్యులు ఉన్నారని, రూ.11,000 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు.