Influenza: భారతదేశ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి దీర్ఘకాలిక దగ్గుతో పాటు కోవిడ్ లక్షణాలతో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. రెండు ఏళ్లుగా కోవిడ్ తో బాధపడిన ప్రజలు ఇప్పుడు పెరుగుతన్న ఫ్లూతో భయపడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా-ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగానే ఇలా జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
హెచ్3ఎన్2 వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా ఆస్పత్రిలో చేరడానికి కారణం అవుతోంది. ఇది రెండు మూడు నెలలుగా భారత్ అంతటా విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంతో పాటు నిరంతర లక్షణాలు, జలుబు లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. రోగి కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతున్నాయి. అయితే ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం లేకున్నప్పటికీ రోగిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. కొంతమంది రోగుల్లో శ్వాసకోశ సమస్యలు కూడా వస్తున్నట్లు డాక్టర్లు తెలుపుతున్నారు.
Read Also: Saudi Arabia: యోగాకు ప్రాధాన్యం.. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టనున్న సౌదీ అరేబియా
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు వంటి కేసులు పెరుగున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సూచించింది. యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు సంబంధించి చికిత్స అందించాలని వైద్యులకు ఐఎంఏ సూచించింది. కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ ఎక్కువగా వాడటం ప్రతికూల పరిస్థితులకు దారితీసింది.
లక్షణాలు:
దగ్గు
వికారం
వాంతులు అవుతున్నాయి
గొంతు మంట
శరీర నొప్పి
అతిసారం
జాగ్రత్తలు..
1) క్రమం తప్పకుండా నీరు మరియు సబ్బుతో మీ చేతులను కడగాలి.
2) ఫేస్ మాస్క్‌లు ధరించండి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
3) తరుచుగా మీ ముక్కు మరియు నోటిని తాకడం మానుకోండి.
4) దగ్గేటప్పుడు మరియు తుమ్మేటప్పుడు మీ ముక్కు మరియు నోటిని సరిగ్గా కప్పుకోండి.
5) హైడ్రేటెడ్ గా ఉండండి, ఎక్కువగా ద్రవాలు తీసుకోండి.
6) జ్వరం మరియు శరీర నొప్పి విషయంలో, పారాసెటమాల్ తీసుకోండి.
7) షేక్ హ్యాండ్, బహిరంగంగా ఉమ్మివేయడం మానేయాలి.
8) యాంటీబయాటిక్స్ మరియు ఇతర మందులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.