Tractor March: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రైతుల సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడింది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో సహా రైతుల డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు నిరసన తెలుపుతున్నారు.
Read Also: India-Bangladesh: భారత్- బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై ఉద్రిక్తత..
దీనికి ముందు రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని కనౌరి బోర్డర్ వద్ద నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సాయాన్ని కూడా ఆయన తిరస్కరించారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా గతేడాది మొదట్లో ఢిల్లీకి మార్చ్ ప్రారంభించారు. అయితే భద్రతా బలగాలు వీరిని అడ్డుకోవడంతో ఖనౌరీ సరిహద్దు పాయింట్ వద్దనే రైతులు క్యాంప్ వేసుకుని నిరసన తెలుపుతున్నారు.
దీనికి ముందు 2021లో వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై వేలాది మంది రైతులు జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించారు. పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అయితే, ఈ ఉద్యమంలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేరినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా వెలువడ్డాయి. కేంద్రం ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో రైతులు ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లారు. అయితే, ఎంఎస్‌పీ మరోసారి నిరసన నిర్వహిస్తున్నారు.