Punjab: పంజాబ్‌లో ఓ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కవ్వడం డాక్టర్ల వంతైంది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏకంగా తాళాలు, ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్స్, వాషర్లు ఇలా అనేక వస్తువులను డాక్టర్లు గుర్తించారు. గత రెండేళ్లుగా సదరు వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. కడుపునొప్పి, జ్వరం, వాంతులు ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుూ ఇటీవల మోగాలోని మెడిసిటీ ఆస్పత్రికి వచ్చాడు.
Read Also: Vivek Ramaswamy: ట్రంప్ దారిలో వివేక్ రామస్వామి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్లు ఎక్స్-రే స్కానింగ్ చేశారు. దీన్ని చూసి ఒక్కసారిగా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతని కడుపుతో అనేక వస్తువుల్ని కనుగొన్నారు. మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇలాంటి కేసు మొదటిదని అన్నారు. చాలా రోజులుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యం పాలయ్యాడని తెలిపారు. 3 గంటలు సర్జరీ చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.
వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా సదరు వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, అయితే అతను చాలా అరుదుగా ఈ సమస్యను ప్రస్తావించే వాడని, దీంతో సమస్య తీవ్రతను మేం పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. అయితే నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించినట్లు తెలిపారు. అయితే అసలు ఇన్ని వస్తువుల్ని ఎలా తీసుకున్నాడనే విషయం తమకు తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే తమ కొడుకు కొన్ని రోజుల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించారు.