DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్‌కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. సీబీఐ విచారణపై మధ్యంతర స్టేని కూడా కోర్టు రద్దు చేసింది. మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి, ఫైల్ రిపోర్టు దాఖలు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలు కేసులు ఉన్న డీకే శివకుమార్‌కి హైకోర్టు నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
Read Also: HCA Elections: రేపే హెచ్‌సీఏ ఎన్నికలు.. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ
ప్రస్తుతం తెలంగాణలో జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం డీకే శివకుమార్ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కి కీలక సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది.
ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు డీకే శివకుమార్ చతురత పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. దీంతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. అయితే దీనిపై శివకుమార్ స్పందించారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగా బీజేపీ ఈ కేసుల్ని పెట్టిందని, తాను ఏ తప్పు చేయలేదని, క్లీన్ గా ఉన్నానని ఆయన అన్నారు.