దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. రేపటితో భారత్‌లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా తొలి డోస్, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్‌లను వేయించుకున్నారు.
భారత్‌లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మేరకు కోవిన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చి ఈ ప్రక్రియను చేపట్టింది. డిసెంబర్ 31 లోగా అర్హులైన వారందరికీ కరోనా టీకాలను అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 20తో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసులకు చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతంలో దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వంటి కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాలను ఉచితంగా అందిస్తుండగా.. ప్రైవేట్ సెక్టారులో మాత్రం నిర్దిష్టమైన ధరలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.