దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24గంటల్లో దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలను నివారించడంలో 97శాతం సమర్థత కలిగి ఉంటాయని చెప్పింది.
ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడినా ప్రమాదం తక్కువేనని వెల్లడించింది. ఇక ఇప్పటివరకు దేశంలో 71కోట్ల కోవిడ్ డోసులను అందించినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఇక కోవిడ్ విజృంభిస్తోన్న వేళ డెంగీ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలను హెచ్చరించింది కేంద్రం. ఉత్తరప్రదేశ్‌లో చిన్నారుల మరణాలకు డెంగీనే కారణమని స్పష్టం చేసింది. డెంగీ నివారణకు వ్యాక్సిన్ లేనందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కోవిడ్‌తో పాటే ఇలాంటి అంటువ్యాధులపైనా పోరును కొనసాగించాలని తెలిపింది.