Himanta Biswa Sarma: మణిపూర్ ఘర్షణలు మరో 10 రోజుల్లో తగ్గుముఖం పడుతాయని, రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ అన్నారు. కేంద్ర హోం శాఖ, మణిపూర్ ప్రభుత్వాలు గత రెండు నెలల నుంచి జరుగుతున్న ఘర్షణలను తగ్గించేందుకు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ మౌనంగా ఉండీ.. శాంతి నెలకొనే సమయంలో ఏడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘర్షణ సమయంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లలేదని, శాంతి నెలకొనే సమయంలో అక్కడికి వెళ్లారని దుయ్యబట్టారు.
ఒక నెల క్రితంతో పోలిస్తే మణిపూర్ లో పరిస్థితి మెరుగుపడిందని, నేను గ్యారంటీగా ఈ విషయం చెబుతున్నానని హిమంత అన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా శుక్రవారం రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ పర్యటనను ‘రాబందుల పర్యటన’గా అభివర్ణించారు.
గత రెండు నెలలుగా మణిపూర్ లో జాతుల మధ్య ఘర్షణ జరగుతోంది. మే 3న ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. మైయిటీ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వద్దని కుకీ, నాగా, ఇతర గిరిజనులు భారీ ర్యాలీ తీశారు. ఈ సమయంలో హింస చెలరేగింది. ముఖ్యంగా మైయిటీ, కుకీ వర్గాల పరస్పరం ఇళ్లను, వాహనాలను తగలబెట్టారు. ఇండియన్ ఆర్మీ పరిస్థితిని చక్కదిద్దడానికి 10,000 మందిని మణిపూర్ లో మోహరించింది. ఈ అల్లర్లలో 100కు పైగా మంది ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు.