Impaired Teacher: సాధారణంగా విద్యాసంస్థల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్, టీజింగ్ చేస్తారు. ఇక సినిమాల్లో అయితే విద్యార్థులు టీచర్‌ను ర్యాగింగ్, టీజింగ్ చేసే సీన్స్ పెడతారు. కానీ వాస్తవంగా బయట ఇటువంటివి ఘటనలు జరగడం చాలా అరుదుగా ఉంటాయి. కానీ కేరళ రాష్ట్రంలో అటువంటి ఘటనే జరిగింది. తమ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిని కొందరు విద్యార్థులు టీజింగ్ చేశారు.. పైగా వారి క్లాసులోనే.. వారికి పాఠం బోధిస్తుండగానే ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే ఆ ఉపాధ్యాయుడు అంధుడు కావడంతో వారు టీజింగ్ చేసినా అప్పటికప్పుడు ఏమీ అనలేకపోయారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
Read also: Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 163, నిఫ్టీ 458పాయింట్ల క్షీణత
కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా కేంద్రంలో గల మహారాజా ప్రభుత్వ కాలేజీలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకుడు అంధుడు. ఆయన అదే కాలేజీలో చదువుకున్నాడు. తరువాత అదే కాలేజీలో అధ్యాపకుడిగా వచ్చాడు. కొద్ది రోజుల క్రితం ఆయన తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఆరు మంది విద్యార్థులు ఆయన చుట్టూ చేరి అల్లరి చేశారు. ఆయన దృష్టి లోపాన్ని చూపెడుతూ అవమానకరంగా మాట్లాడారు.ఈ వెకిలి చేష్టలను వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం వాటిని ఇంటర్నెట్‌లో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వీడియో వైరల్‌గా మారింది. ఘటనలో పాల్గొన్న విద్యార్థుల తీరుపై విమర్శలు వచ్చాయి. విషయం కాస్త కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీతో ఘటనకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే బాధిత అధ్యాపకుడు మాట్లాడుతూ .. తాను ఒక గంట విద్యార్థులకు బోధన చేయడం కోసం రెండు గంటలపాటు ప్రిపేర్ అయి వస్తానని.. కానీ విద్యార్థులు ఆ విధంగా ప్రవర్తిస్తారని తాను అనుకోలేదని చెప్పిన ఆయన.. తనపై వచ్చిన వీడియోను చూసి ఆయన స్నేహితులు, బంధువులు బాధపడ్డారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాను కాలేజీ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకుంటానని అధ్యాపకుడు తెలిపారు.