Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన చేస్తుందని ఆరోపించారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. భారతదేశం ఒక పూలదండ లాంటిదని, దీంట్లో ప్రతీ పువ్వు గౌరవించబడాలని, అప్పుడే మొత్తం పూల గుత్తికి అందం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Sridhar Babu: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తాం..
భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచన ప్రతీ ఒక్క యువ భారతీయుడిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారతదేశంలో ఎక్కువ నాయకులు ఎందుకు ఉండలేకపోతున్నారనిర ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రశిస్తూ.. దీనికి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఆలోచనా విధానమే ప్రధాన తేడా అని అన్నారు. దేశంలోని ప్రజల మాట వినాలని, వారి విశ్వాసాలను, భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని, గౌరవించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఏదో రకమైన ఆంక్షలు విధించాలని భావిస్తోందని ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ భావజాలంతో బ్రిటీష్ వారి నుంచి మనకు స్వేచ్ఛ లభించలేదని, భారతదేశాన్ని ప్రజలంతా భావించాలని మేము కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్ నుంచి మరోసారి ఆయన ఎంపీ బరిలో నిలుచున్నారు. నామినేషన్ తర్వాత ఆయన రెండోసారి నియోజకవర్గంలో పర్యటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళలోని 20 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.