Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేంద్రం యాక్షన్ మొదలు పెట్టింది. ఇటీవల కెనడాలోని హిందువులు పారిపోవాలని హెచ్చరించాడు. గతంలో కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, జై శంకర్ ని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇటీవల కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఇండియా, కెనడాల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగుతోంది. భారత్ కూడా ఇటు కెనడాకు బుద్ది చెప్పడంతో పాటు ఖలిస్తానీ ఉగ్రవాదులపై గట్టి చర్యలు తీసుకుంటోంది. తాజాగా గురుపత్వంత్ సింగ్ పన్నూకి పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, భూములను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. అమృత్‌సర్ లో అతనికి చెందిన భూమిని జప్తు చేసింది.
అమృత్‌సర్ జిల్లా శివార్లలో అతని పూర్వీకులకు ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. పన్నూకు ఉన్న అన్ని ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. పంజాబ్‌లో పన్నన్‌పై మూడు దేశద్రోహం సహా 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Read Also: Srikanth Iyengar: ఏం పీకుతాడో చూస్తా.. బూతులతో రెచ్చిపోయిన శ్రీకాంత్ అయ్యంగార్
కెనడా-ఇండియా దౌత్యవివాదం చెలరేగిన తర్వాత.. పన్నూ ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇండో కెనడియన్ హిందువులారా, మీరు కెనడా, కెనడా రాజ్యాంగంపై విధేయత చూపించడం లేదు. మీరు కెనడాను వదిలి భారత్ వెళ్లిపోవాలి అని హెచ్చరించాడు. ఖలిస్తాన్ అనుకూల సిక్కులు ఎప్పుడూ కెనడాకు విధేయులుగా ఉన్నారు. వారు ఎల్లప్పుడు కెనడా పక్షాన, అక్కడి చట్టాలను, రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నారు అని అన్నాడు.
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ 2020లో పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది. అయితే భారత అభ్యర్థనను ఇంటర్‌పోల్ రెండు సార్లు తిరస్కరించింది. పన్నూ విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉద్యమం, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించడంలో కీలకంగా ఉన్నాడు. ఇదే కాకుండా పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.