సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. 1989 నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉందని డిపార్ట్మెంట్ మిలిటరీ ఎఫైర్స్ అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ పూరి వెల్లడించారు. ప్రతీ ఏడాది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 17,600 మంది రిటైర్ అవుతున్నారని ఆయన తెలిపారు. సైన్యంలో యువరక్తాన్ని నింపేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు తెలిపారు. సంస్కరణల్లో కొత్తదనంతో పాటు అనుభవాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సాధారణ సైనికులకు సియాచిన్, ఇతర ప్రాంతాలలో వర్తించే భత్యం ‘అగ్నివీర్’లకు కూడా లభిస్తుందని.. ఈ విషయంలో ఎలాంటి వివక్ష లేదని అన్నారు.
దేశసేవలో ప్రాణత్యాగం చేస్తే ‘అగ్నివీరులకు’ కోటి రూపాయల పరిహారం లభిస్తుందని అరుణ్ పూరి తెలిపారు. రాబోయే 4-5 సంవత్సరాలలో, మన సైనికుల సంఖ్య 50,000-60,000కు తరువాత 90,000 – 1 లక్షకు పెరుగుతుందని వెల్లడించారు. ఈ పథకం అమలులో లోటుపాట్లను విశ్లేషించడానికి, మౌలిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి తొలుత 46 వేల సంఖ్యతో ఈ పథకాన్ని కొద్ది సంఖ్యతో ప్రారంభించామని.. సమీప భవిష్యత్తులో 1.25 లక్షలకు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.
కోచింగ్ సెంటర్లు తమ లబ్ధి కోసం అభ్యర్థులను రెచ్చగొట్టారని.. ఆందోళల్లో పాల్గొన్న వారిని ఆధార్ టెక్నాలజీ ద్వారా గుర్తిస్తామని అన్నారు. ఈ పథకంపై హింసను తాము ఊహించలేదని.. సాయుధ బలగాలల్లో క్రమశిక్షణారాహిత్యానికి తావు లేదని అభ్యర్థులంతా తాము ఎలాంటి హింసకు పాల్పడలేదనే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని అనిల్ పూరి వెల్లడించారు. పోలీసు విచారణ తరువాతే సైన్యంలోకి తీసుకుంటామని అన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని సైన్యంలోకి తీసుకోబోమని వెల్లడించారు.