Bro: తెలుగు చిత్రసీమలో మాత్రమే కాదు, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా… ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆర్టిస్టులను తెర మీద చూపిస్తే… ఫాన్స్ తెగ ఖుషీ అవుతారు. అన్నదమ్ములు ఇద్దరూ హీరోలైతే… వారి కాంబినేన్ లో మూవీ ఎప్పుడు వస్తుందా? అని ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. చిత్రం ఏమంటే… ఇవాళ తెర మీద అన్నదమ్ములనే కాదు… కాస్తంత క్రేజ్ ఉన్న రక్త సంబంధీకులు నటించినా హ్యాపీ ఫీలయ్యే ఫ్యాన్ తెలుగులో ఉన్నారు. టాలీవుడ్ లో మూడు నాలుగు సినీ కుటుంబాలు రెండు మూడు దశాబ్దాలుగా బలంగా వేళ్ళూనుకుని ఉన్నాయి. ఆ కుటుంబంలోని వారు ఒకే సినిమాలో తెర మీద కనిపిస్తే చూసి ఆనందించే వారు కోకొల్లలు. అలా మేనమామ – మేనల్లుళ్ళ కాంబినేషన్ కోసం ఎదురుచూసే వాళ్ళూ లేకపోలేదు. విక్టరీ వెంకటేశ్ అతని సోదరి కుమారుడు, మేనల్లుడు నాగ చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘వెంకీమామ’ను నాలుగేళ్ళ క్రితం సురేశ్ బాబుతో కలిసి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. కె.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మోడరేట్ సక్సెస్ ను సాధించింది.
విశేషం ఏమంటే… మళ్ళీ ఇప్పుడు ఈ మేనమామ- మేనల్లుడు కాంబోతోనే విశ్వప్రసాద్ ‘బ్రో’ మూవీని తీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అతని సోదరి కుమారుడు, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తొలిసారి ‘బ్రో’ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలను కలిసి చేస్తున్నారు. ‘వెంకీమామ’ డైరెక్ట్ తెలుగు సినిమా కాగా, ‘బ్రో’ మాత్రం తమిళ చిత్రం ‘సీతాయవినోదం’కు రీమేక్. మాతృకకు దర్శకత్వం వహించిన సముతిర కని దీన్ని తెలుగునూ రూపొందిస్తున్నారు. మెయిన్ పాయింట్ ను తీసుకుని, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. విశేషం ఏమంటే… ఈ రెండు సినిమాకు మరో సారూప్యం కూడా ఉంది. ‘వెంకీ మామ’కు సంగీతం అందించిన తమన్… ఇప్పుడీ ‘బ్రో’ కూ మ్యూజిక్ అందిస్తున్నాడు. బ్లడ్ రిలేషన్స్ తో స్పెషల్ కాంబోను సెట్ చేసి సినిమాలు తీస్తున్న టి.జి. విశ్వప్రసాద్ చాతుర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!