యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ఈ పాటతో కొత్త నేలపై సంచారి ప్రయాణం చూపించబోతున్నట్టుగా విడుదలైన టీజర్ బట్టి తెలుస్తోంది. 1970లో యూరప్ లో ఉండే విక్రమాదిత్య అనే పామిస్ట్ గా ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ అనే ఫిజిషియన్ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, టీజర్ మూవీని ఎంత భారీగా తీశారో చెప్పకనే చెబుతున్నాయి. 16వ తేదీ వచ్చే ఈ ‘సంచారి’ గీతం కూడా మూవీ మీద అంచనాలను భారీగా పెంచేలా ఉంటుందని అంటున్నారు. కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చిత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.