కన్నెజున్నుముక్క అన్న పదానికి అసలు సిసలు అర్థం చెప్పిన చక్కనిచుక్క దివ్యభారతి. పదహారో యేడు పలకరించగానే పరువాల పాపగా వెండితెరను మరింతగా వెలిగించింది దివ్యభారతి. తెలుగు చిత్రాలతోనే ఓ వెలుగు చూసిన దివ్యభారతి ఆ నాటి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని తరిగిపోని స్థానం సంపాదించింది. నవయవ్వనం కాంతులు వెదజల్లుతూండగానే అభిమానులను శోకసముద్రంలో ముంచేసి ఎంచక్కా ఈ చక్కనిచుక్క నింగిలో కలసిపోయింది. అయితేనేం, దివ్యభారతి అందాన్ని నాడు ఆరాధించిన వారందరూ నేటికీ ఆమెను మననం చేసుకుంటూనే ఉన్నారు.
దివ్యభారతి 1974 ఫిబ్రవరి 25న బొంబాయిలో జన్మించింది. అక్కడే మనేక్ జీ కూపర్ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి దాకా చదువుకుంది. పదో తరగతిలో అడుగు పెట్టాక, సినిమాలపై మోజుతో అక్కడ తన అదృష్టం పరీక్షించుకోవాలని నిశ్చయించింది. అదే సమయంలో ‘గునాహోంకా దేవతా’ అనే చిత్రంలో దివ్యభారతిని ఎంపిక చేశారు. అయితే మరీ చిన్నపిల్ల అయిన కారణంగా, ఆ పాత్రను సంగీత బిజ్లానీని ఎంచుకున్నారు. తరువాత ‘రాధా కా సంగమ్’లో గోవింద సరసన నాయికగా దివ్యను తీసుకున్నారు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర కూడా ఆమె చేజారిపోయింది. డి.సురేశ్ బాబు తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన ‘బొబ్బిలిరాజా’లో దివ్యభారతిని నాయికగా పరిచయం చేశారు. డి.రామానాయుడు సమర్పణలో తెరకెక్కిన ఈచిత్రానికి బి.గోపాల్ దర్శకులు. ‘బొబ్బిలిరాజా’ చిత్రం షూటింగ్ సాగుతున్న సమయంలోనే తమిళంలో ‘నిల పెన్నె’ అనే చిత్రంలో దివ్యభారతి నాయికగా నటించింది. ఈ సినిమాయే ముందు విడుదలయింది. కానీ, పరాజయం పాలయింది. 1990లోనే విడుదలైన ‘బొబ్బిలిరాజా’ ఘనవిజయం సాధించింది. దాంతో తెలుగునాట దివ్యభారతి పేరు మారుమోగింది. ఆ సినిమా చూసిన నాటి కుర్రాళ్ళు, దివ్యభారతిని తమ కలల రాణిగా చేసుకున్నారు.
‘బొబ్బిలిరాజా’ సక్సెస్ తరువాత మోహన్ బాబు సరసన ‘అసెంబ్లీ రౌడీ’లోనూ దివ్యభారతి భలేగా మురిపించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. చిరంజీవితో ‘రౌడీ అల్లుడు’లోనూ, బాలకృష్ణ జోడీగా ‘ధర్మక్షేత్రం’లోనూ దివ్యభారతి అందం జనానికి శ్రీగంధాలు పూసింది. కృష్ణతో ‘నా ఇల్లే నా స్వర్గం’, మోహన్ బాబుతో ‘చిట్టెమ్మ మొగుడు’ చిత్రాల్లోనూ దివ్యభారతి నటించింది. తరువాత హిందీ సినిమా బాట పట్టింది దివ్య. అక్కడ “విశ్వాత్మ, దిల్ కా క్యా కసూర్, షోలా ఔర్ షబ్నమ్, దీవానా, బల్వాన్, గీత్, దిల్ ఆష్నా హై, క్షత్రియ” వంటి చిత్రాలలో దివ్య అందం ఎంతగానో మురిపించింది. షారుఖ్ ఖాన్ తొలి చిత్రం ‘దీవానా’లోనూ దివ్యభారతియే నాయిక కావడం విశేషం. ఆమె మళ్ళీ తెలుగునాట నటించిన సినిమా ‘తొలి ముద్దు’. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే దివ్యభారతి 1993 ఏప్రిల్ 5న అకాలమరణం పాలయింది. దాంతో ఒక్కసారిగా దివ్యభారతి అభిమానగణాలు శోకసముద్రంలో మునిగాయి. ‘తొలి ముద్దు’ చిత్రంలో దివ్యభారతి బదులుగా రంభను లాంగ్ షాట్స్ లో చూపిస్తూ సినిమాను పూర్తి చేశారు. దివ్యభారతి చివరి చిత్రం అనే ట్యాగ్ తో ‘తొలిముద్దు’ పరవాలేదనిపించింది. హిందీలోనూ ఆమె మరణానంతరం “రంగ్, షత్రంజ్” చిత్రాలు విడుదలయ్యాయి. దివ్యభారతి మరణంతో దాదాపు 14 సినిమాలు నిలచిపోయాయి. ఏది ఏమైనా దివ్యభారతి అందం, చందం ఆమె అభిమానుల మదిలో ఈ నాటికీ నిలచే ఉన్నాయి.