మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన మామగారిని జాగ్రత్తగా చూసుకొంటున్నదట . అపోలో నుంచి వైద్యులను ఇంటికి పంపి చిరును జాగ్రత్తగా చూసుకోమని తెలిపినట్లు సమాచారం.
ఇకపోతే చిరుకు నెగెటివ్ వచ్చినా కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిదిగా వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడినట్టే. ప్రస్తుతం చిరు నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం కాగా.. గాడ్ ఫాదర్ సినిమా మరియు భోళా శంకర్ సినిమాల షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.