‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ను పెద్దల సభకు ఎంపిక చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కలిశారు. విజయేంద్ర ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో బండి సంజయ్ మనసులో ఉన్న ‘రజాకార్ ఫైల్స్’ మూవీ ముచ్చట కూడా వారి మధ్య వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… గతంలో రజాకార్ల ఆగడాలు, అకృత్యాల నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ‘రాజన్న’ చిత్రం తెరకెక్కించారు. ఇప్పుడు ఆ కథను మరింత శక్తివంతంగా సినిమాగా తీయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ కోరినట్టు తెలుస్తోంది.
మరి ‘రజాకార్ ఫైల్స్’కు విజయేంద్ర ప్రసాద్ కేవలం కథను అందిస్తారా లేకపోతే ఆయనే దర్శకత్వ బాధ్యతలూ వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్ వాల్వ్ అయితే… ఈ మూవీని ‘కశ్మీర్ ఫైల్స్’ తీసిన అభిషేక్ అగర్వాలే నిర్మిస్తారని అంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి సినిమాను తీయడానికి చాలానే సమయం పడుతుంది. అతి త్వరలోనే దీనిని ప్రారంభించినా, వచ్చే వేసవి కాలం నాటికి కానీ సిద్ధం కాదు. అయితే… ఈ మధ్యలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు వస్తే… ఈ సినిమాను ట్రంప్ కార్డ్ గా బండి సంజయ్ వినియోగించాలనుకుంటున్నారని, అందువల్ల ‘రజాకార్ ఫైల్స్’ను జనవరి లేదా ఫిబ్రవరి నాటికే విడుదలకు సిద్ధం చేస్తే బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ తో చెప్పారని అంటున్నారు. మరి ఈ విషయమై విజయేంద్ర ప్రసాద్ లేదా అభిషేక్ అగర్వాల్ అధికారికంగా ప్రకటిస్తేనే… నిజానిజాలు ఏమిటనేది తేటతెల్లమవుతాయి.