Raviteja: మాస్ మహరాజా రవితేజ కొంతకాలంగా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాను హీరోగా నటిస్తున్న సినిమాలతో పాటు యంగ్ హీరోస్ చిత్రాలను ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమిళ కథానాయకుడు విష్ణు విశాల్ ఆ మధ్య తీసిన ‘ఎఫ్.ఐ.ఆర్., మట్టికుస్తీ’ చిత్రాలకు రవితేజ ప్రెజెంటర్ గా వ్యవహరించారు. అయితే అదే తరహాలో ఇప్పుడు తెలుగు సినిమా ‘ఛాంగురే బంగారు రాజా’నూ రవితేజ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గత యేడాది ఆగస్ట్ లో షూటింగ్ మొదలైన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా టీజర్ ను రవితేజ బుధవారం విడుదల చేశారు. వినోద ప్రధానమైన ఈ చిత్రంలో ప్రేక్షకులను సంభ్రమకు గురిచేసే థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ఈ టీజర్ చూస్తే అర్థమౌతోంది. సతీశ్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఛాంగురే బంగారు రాజా’కు శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం, నారప్ప’ చిత్రాలలో నటించిన కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య, నిత్యశ్రీ, ఎస్తర్ నోరోన్హా, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
సునీల్ వాయిస్ లో కుక్కను పరిచయం చేయడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఓ ప్రమాదంలో ముగ్గురిని కలిసిన తర్వాత తన జీవితం ఎలా తలకిందులైందో కుక్క వివరిస్తుంది. కార్తీక్, సత్య, రవిబాబు ముగ్గురు వేర్వేరు అమ్మాయిలను ప్రేమిస్తునట్లు కనిపించారు. కానీ వారిని హత్య కేసులో నిందితులుగా అరెస్టు చేస్తారు. హంతకుడు ఎవరు? వీరిలో ఒకరా లేదా బయటి వ్యక్తా ? అనేది సస్పెన్స్. ఈ టీజర్ హిలేరియస్ గా ఉండి, గ్రిప్పింగ్ కథనంతో సినిమా ఉంటుందనే భావన కలిగిస్తోంది. దర్శకుడు సతీష్ వర్మ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫ్రెష్ క్రైమ్ జానర్‌ని మిక్స్ చేశాడు. కార్తీక్, సత్య, రవిబాబు త్రయం తమ పాత్రలను చక్కగా పోషించారు. సునీల్ వాయిస్‌ఓవర్ ఈ టీజర్ కు స్పెషల్ అట్రాక్షన్! ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సంగీతం అందించగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ ఉన్నవ ఎడిటర్. బుధవారం విడుదలైన ఈ టీజర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. అతి తక్కువ టైమ్ లోనే వన్ మిలియన్ కు పైగా వ్యూస్ ను ఈ టీజర్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే… రవితేజ సమర్పకుడిగా వ్యవహరించిన సినిమాలేవీ ఇంతవరకూ ఘన విజయం సాధించలేదు. ఇక ఇటీవల విడుదలైన ‘రావణాసుర’ అయితే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోర్లా పడింది. దానికి తోడు ‘నేను రావణాసుర’ ఫ్యాన్ అంటూ రవితేజ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అవుతున్నాయి. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత చీప్ గా వ్యవహరించాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైమ్ కామెడీ గా రవితేజ నిర్మించిన ‘ఛాంగురే బంగారురాజా’ ఈ మాస్ మహరాజాకు సక్సెస్ ను ఇచ్చి, కాస్తంత ఊరడింపు కలిగిస్తుందేమో చూడాలి.