Inimel: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో అటు కోలీవుడ్ నే కాదు ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా హీరో అవతారమెత్తాడు. అయితే సినిమా కోసం కాదులెండి.. ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మ్యూజిక్ వీడియో పేరు ఇనిమెల్. ఈ వీడియోలో లోకేష్ సరసన శృతి హాసన్ నటించింది. ఇప్పటికే ఈ వీడియో నుంచి వచ్చిన ప్రోమో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృతితో లోకేష్ ఘాటు రొమాన్స్ కు ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు.
ఇక తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాకు ధీటుగా ఈ సాంగ్ ను డైరెక్ట్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. ఇక ఈ సాంగ్ కు శృతి మ్యూజిక్ అందించడమే కాకుండా కాన్సెప్ట్ ను కూడా అందించడం విశేషం. అంతేకాదు కమల్ ఈ సాంగ్ కు లిరిక్స్ రాశారు. చిన్న చిన్న గొడవల వలన భార్యాభర్తలు ఎలా విడిపోతున్నారు అనేది ఈ సాంగ్ లో చూపించారు. ఒక డేటింగ్ యాప్ ద్వారా శృతి, లోకేష్ కలుస్తారు. మొదటి డేట్ లోనే వారు సినిమాకు వెళ్తారు. ఆ సినిమాలోని క్యారెక్టర్స్ లో తమను తాము ఊహించుకుంటారు. ఇద్దరు ప్రేమించుకోవడం.. లోకేష్, శృతికి ప్రపోజ్ చేయడం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, రొమాన్స్ అంతా బాగా జరుగుతున్న నేపథ్యంలో.. లోకేష్ వర్క్ లో బిజీ అవ్వడం, దానివల్ల శృతిపై చిరాకు పడడంతో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలా విడాకులకు దారితీస్తుంది. ఏడాది తిరగకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతారు. ఇక ఆ సినిమా చూసిన లోకేష్, శృతికి సారీ చెప్పి.. మళ్లీ తన ప్రేమను కంటిన్యూ చేస్తున్నట్లు చూపించారు. ఇక హీరోగా మొదటిసారి అయినా లోకేష్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. శృతి అందం, వాయిస్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.